"కలుషితం" - అందె శ్రీధర్

************"కలుషితం"*************

పల్లవి: గాలె కాదు నీరె కాదు మనసంత కలుషితం
అంతరాత్మ అంతరాలు తరచిచూస్తె కలుషితం
మాటె కలుషితం చూపె కలుషితం
మౌనంలో దాగున్న భావమెంత కలుషితం
"మాటె కలుషితం "

చరణం: అత్మ చంపి జీవించె మనుషుల్లొ కల్మషం
దేవుళ్ళమని చెప్పుకొంటె ఆద్యాత్మిక కలుషితం
ఆచరణె సాధ్యమవని మాటలన్నికలుషితం
తీర్చలేని వరాలిస్తె ప్రజాస్వామ్య కలుషితం
కోరికల్లొ స్వార్ధముంటె భక్తునిలో కలుషితం
వంచించే మనసుంటే ప్రేమంతా కలుషితం
"మాటె కలుషితం "

చరణం: హద్దు దాటి అడుగేస్తె యవ్వనమె కలుషితం
అన్యోన్యమె లేకుంటె దాంపత్యం కలుషితం
తెలిసి కూడ తప్పు చేస్తె అనుభవమే కలుషితం
అంటరాని వాళ్ళంటె నీ బుద్ది కలుషితం
నిన్ను నీవు ఎరుగకుంటె నీ జన్మ నిష్పలం
విడిపోయె జీవితంలొ కన్నీరె కలుషితం
"మాటె కలుషితం "

చరణం: స్వార్ధమున్న మనసుంటె మనిషంతా కలుషితం
తల్లిదండ్రిని ప్రేమించని జీవితమే కలుషితం
ఆట పాట లేకుంటె బాల్యమంత కలుషితం
హింస పెట్టి మురిసిపోతె ఆనందం కలుషితం
పైశాచిక ఆనందం శ్రుంగారం కలుషితం
సంస్కారం నేర్పలేని విద్యాబుద్ది కలుషితం
(భాధ్యతంటు లేకుంటె బ్రతుకుదెరువు కలుషితం)
"మాటె కలుషితం "

-------------------------------------
అందె శ్రీధర్ రెడ్డి

Posted Date:2014-03-19 13:13:38
comments powered by Disqus