ఎక్కడ నా చిరునామా ?
రెండు అసమా సమజాల
అనైతిక, బలవంతపు
కలయిక , నీ స్వార్థానికి
అహంకారానికి ఒక చిహ్నం
నీ విజయానికి సోపానం
నా జాతి ,సంస్కృతీ
పై విదించిన ఆదిపత్యపు
మరణ దండన
దశాబ్దాలుగా
పురిటినొప్పులు పడుతున్న
ఉద్యమాల ఆవేదన
భగ భగ మని మండే
నా అమాయకపు తీరని
కోరికలు
నవ యవ్వనానికి
నిండు నూరేళ్ళకి
చుట్టుకున్న రక్తాక్షరాలు
నిరంతరం ముల్లులై గుచ్చే
అణచివేత అనుభవాలు
కరగని కలల నిండా
అమరుల శిలాజాలాలు
నా దార్లు
నెత్తురు విరజిమ్మే దావానలలు
నా ప్రతి ఉదయం
నయ వంచనల కాలం
చూపుని కాటేసి
చీకటిని మిగిల్చిన గతం
నా ప్రపంచం ఒక
కల్లోల కన్నీటి సముద్రం
నా చుట్టూ విషవాయువై నిండి
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూన్న
కంటికి కానరాని 'అ'ప్రజాస్వామ్యం
ఎవడిచ్చాడు ఎవడికి స్వతంత్రం?
మతం మత్తులో
నలుగుతూన్న నా జనం
వలసాదిపత్యపు తుపాకి
నీడలో నా జీవనం
కులం సంకెళ్ళతో
కుళ్ళుతున్న సమాజం
భూస్తాపితమైన స్త్రీ స్వతంత్రం
బానిసత్వం గా మారుతున్న
తరతరాల అమాయకత్వం
నీ సామ్రాజ్య వాద పోకడలు
నా కోరికలకు
చుట్టుకుంటున్న ఉరితాళ్ళు
అయినా నిరంతరం నినదిస్తున్న
ప్రశ్నిస్తున్నా
నా స్వాతంత్రపు సమాధులపై
కట్టిన పార్లమెంట్ కు సవాలై నిలబడ్డా
నాకు నేనే శిక్ష వేసుకుని
చెట్టుకు వ్రేలాడుతూ
యాది రెడ్డినై ..శ్రీకాంతునై..
తెలంగాననై..ఎక్కడ నా చిరునామా అని..
సుజాత సూరేపల్లి