|
ఎన్నేండ్లు ఈ తన్లాట?
ఉద్యమాల అగ్గిగుండంలో
చేతనంగా
ఊపిర్లు బిగబట్టి
న్యాయం కోసం నాలుగు దిక్కులా
నడుస్తున్న తెలంగాణా
నమ్మకాలను కాలుస్తున్న
వోటు రాజకీయం
విప్లవాల దర్వాజాలు తెరిచి
తెగబడుతున్న తెలంగానం
నవ్వుల పాలు అయి
వంటిమీద లాటిలై విరుగుతున్న
సామ్రాజ్యవాద బూర్జువా ప్రజాస్వామ్యం
పెట్టుబడుల కాకి లేక్ఖల కింద న్యాయన్యాలు
గోతి కాడ గుంటనక్కలు మా
మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీలు
తెలంగాణా తెస్తే మేమే
తేకపోతే ఆంధ్రా లాబీ అనే మేధావులు
భూమిలనుంచి బొగ్గు కదలనంటుంది
ఆర్టీసి పయ్య దగాకోరులని మొయ్య అంటుంది
కిక్కేక్కిచ్చే మత్తు మందు కూడా
అర్థం కాని కాక్టెయిల్ అయి కూసుంది
నల్లకోట్లతో న్యాయవాదుల నగారా దద్దరిల్లుతుంది
ఇంటింటా బోన మెత్తి బొట్టు పెడుతున్న
సమ్మక్క సారలక్కలు
సదువులకు కొలువులకు
బందు ప్రకటించిన
వీర తెలంగాణా
కలాలకి కాలాలకి కళ్ళనీళ్ళు తెప్పిస్తున్న
బుగ్గి పాలు అయి పోతున్న
మావోళ్ళ ఆత్మ బలి దానాలు
గద్దలై తిరుగుతున్న ఖాకీల బలగాలు
సోనియమ్మ చేతిల
తెలంగాణా బతుకు
ఇటలి అమ్మకేం తెలుసు
జొన్న గట్క ముద్దలు
జానపద సుద్దులు
నిలువనీడనిచ్చిన అమ్మని అమ్మే
కమ్మ కొమ్ములకేం తెలుసు
అవ్వ పెట్టే బుక్కెడు కమ్మటి కలి అన్నం
పల్లేరు కాయల బాట్ల
వొళ్ళంతా పచ్చి పుండ్లు చేసుకొని
వొడుస్తున్న రక్తమంసాలతోటి
యేండ్ల సంధి తన్లాడుతున్న
తల్లి తెలంగాణా .
'సమ్మె'ట పోటు తోని
సావు డప్పులు మోగిస్తున్న
తెలంగాణా గుండె సప్పుల్లకన్న
కడులుతదా ఈ రాజకీయం
రాబందుల బందీఖాన లోంచి
ఆజాది ఎప్పుడు ఎక్కడా..
జర జాడ చెప్పమ్మా..
సుజాత సూరేపల్లి
|