ద్రుతరాష్ట్రుని కౌగిలి !-- సుజాత సూరేపల్లి

ద్రుతరాష్ట్రుని కౌగిలి !

అవతరణ దినమా ఇది 
అడుక్కు తినటానికి  వచ్చి
అమ్మోరిని ఎత్తుక పోయిన దినం 

మా బిడ్డలని మట్టికి దూరం చేసి 
మీ కుట్రల కోరలు నాలుగు దిక్కులా 
పాకించిన  దినం 

మా బువ్వ కూరలని 
అటకెక్కించి 
అవ్వ అక్కలని అల్లాడించిన
సీమాంద్ర వలసాంధ్ర  వాద దినం    

గుండెల మీద కుంపటి అయిన  
సమైక్యాంద్ర నినాదం 
కర్ణుని కవచ కుండలాలై 
దిగబడ్డ వైనం 
ద్రుతరాష్ట్రుని కౌగిలి అయి 
ఊపిరాడని స్నేహం 

నిన్ను పెకిలియ్యనిదే 
ఈ గడ్డకి  విముక్తి లేదు 
నా మరణం తోనే 
నీకు సమాధి 
మల్లా నాకొక కొత్త జన్మ 

నా నరనరాల్లో పాతుకుపొఇన 
నీ విషపు కోరల నుంచి బయట 
పడనంత కాలం 
జీవితమంతా నరకం
కాలమంత కలుషితం 

పెయ్యి కాలుతున్నది 
మోసాల పొలుసులు రాలుతున్నాయి 
అయితే కానీయ్ 
కొత్త చర్మం కోసం 
చర్నకోల్లతో కొట్టుకుంటాం 
పెయ్యిడసక పొతే 
గావు బడతం...
పోలేరమ్మకి బలి పెడతాం   
జై తెలంగాణా అని 
పండగ చేసుకుంటాం.. 

సుజాత సూరేపల్లి 

Posted Date:2014-03-19 14:30:49
comments powered by Disqus